ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన వామపక్షాలు

  • సీఎంతో సీపీఎం, సీపీఐ బృందాలు వేర్వేరుగా భేటీ
  • రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామన్న సీఎం
  • ధాన్యం కొనుగోలు, మూసీ ప్రక్షాళన, విద్యారంగంపై వారి మధ్య చర్చ
సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వామపక్షాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో సీపీఎం, సీపీఐ బృందాలు వేర్వేరుగా సీఎంతో సమావేశమయ్యాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆయా పార్టీల నేతలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడం తప్ప కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా తాము కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, మూసీ ప్రక్షాళన, విద్యారంగ అంశాలపైనా వారి మధ్య చర్చ జరిగింది.

ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి

ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా హమాలీలు వారి స్వస్థలాలకు వెళ్లారని, దీంతో కొరత ఏర్పడిందని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగడంలేదని చెప్పారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని అన్నారు.

మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆయా పార్టీలు రాజకీయం చేయకూడదని కోరారు. మూసీ పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యారంగంలో చేపడుతున్న కార్యక్రమాలను వారికి ముఖ్యమంత్రి వివరించారు.

Revanth Reddy
Telangana CM
CPM
CPI
Minimum Wages
Paddy Procurement
Musi River
Indiramma Houses

More Telugu News